Bumrah: ఐసీసీ రేటింగ్ పాయింట్లలో అశ్విన్ ను దాటేసిన బుమ్రా..! 3 d ago
ఐసీసీ రేటింగ్ పాయింట్లలో పేసర్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా భారత అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ రికార్డును అధిగమించి అత్యధిక రేటింగ్ సాధించాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన బౌలింగ్ ర్యాంకింగ్స్ లో బుమ్రా 907 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2016 డిసెంబరులో అశ్విన్ (904) భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించాడు. బుధవారం బుమ్రా ఆ రికార్డును తిరగరాశాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్ల జాబితాలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు డెరెక్ అండర్వుడ్ (907)తో కలిసి బుమ్రా సంయుక్తంగా 17వ స్థానంలో ఉన్నాడు. మెల్బోర్న్ లో బాక్సింగ్ డే టెస్టుకు ముందు బుమ్రా 904 పాయింట్లతో అశ్విన్ రికార్డును సమం చేశాడు. ఎంసీజీలో అద్భుతమైన ప్రదర్శనతో 9 వికెట్లు పడగొట్టిన బుమ్రాకు మరిన్ని రేటింగ్ పాయింట్లు లభించాయి. బ్యాటింగ్ లో యశస్వి జైశ్వాల్ నాలుగో ర్యాంకు సాధించాడు. రిషబ్ పంత్ 12, శుబ్మన్ గిల్ 20వ స్థానాల్లో ఉన్నారు.